గోవా విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ఫ్లైట్ కోసం సూర్య వేచిచూస్తున్నాడు.
గోవా విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ఫ్లైట్ కోసం సూర్య వేచిచూస్తున్నాడు. గంటలో విమానం ఎక్కాల్సి ఉండగా ఫోన్ వచ్చింది. ‘సర్.. మేము ముంబైలోని ఫెడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పార్సిల్ రిటర్న్ అయ్యింది.. అందులో ఏదో అనుమానాస్పద వస్తువు ఉందేమోనని ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చాం. వాళ్లు కేసు నమోదు చేశారు.
మీతో ఎస్‌ఐ మాట్లాడుతారట’ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. తర్వాత మళ్లీ ఇంకో వ్యక్తి ఫోన్ చేసి హలో.. నేను ఎస్‌ఐని మాట్లాడుతున్నాను.. మీ పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయి.. మీ ఆధార్ నంబర్ ఎంత.. అడ్రస్ ఎక్కడ.. అని అడిగాడు. ఇదంతా విన్న సూర్య అమ్మో ఇదేదో సైబర్ మోసంలా ఉన్నదని గ్రహించి నాది హైదరాబాద్.. కేసు నమోదైతే హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి.. ఆధార్ నంబర్, అడ్రస్ చెప్పను అని కరాఖండిగా చెప్పేశాడు.
అనంతరం హైదరాబాద్ చేరుకున్నాక సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది సైబర్ నేరగాళ్ల పనే అని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఫెడెక్స్ తరహా మోసాలు బాగా పెరిగిపోయాయని పోలీసులు చెప్పారు. ముఖ్యంగా విమానప్రయాణికులే లక్ష్యంగా ఈ మోసాలు జరుగుతున్నాయని వెల్లడించారు. విమాన ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పెడుతుండటంతో సైబర్ నేరాగాళ్లు ఫోన్లు చేసి ఈ తరహా మోసాలకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఫెడెక్స్‌లాంటి నేరాలకు సంబంధించి 2022లో 64 కేసులు నమోదు కాగా.. 2023లో 645 కేసులు నమోదయ్యాయి. 2022 నుంచి 2024 జనవరి వరకు నమోదైన అన్ని కేసుల్లో నేరగాళ్లు రూ.18 కోట్లకుపైగా దోచుకున్నారు. ఇలాంటి నేరాల పట్ల విమాన ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి.
-తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఏడీజీ శిఖాగోయెల్