హైదరాబాద్ లో బుర్కా గ్యాంగ్‌ హాల్‌చల్‌

హైదరాబాద్‌లో గతంలో చెడ్డీ గ్యాంగ్‌ హాల్‌చల్‌ చేసింది.

హైదరాబాద్‌లో గతంలో చెడ్డీ గ్యాంగ్‌ హాల్‌చల్‌ చేసింది. నేడు చుడీదార్‌తో కూడిన బుర్కా గ్యాంగ్‌ హాల్‌చల్‌ చేస్తోంది.. ఆడవారి వేషంలో అపార్టుమెంట్లలోకి చొరబడి.. తాళం వేసి ఉన్న ఇండ్లను లూటీ చేస్తున్నారు. ఈ కొత్త తరహా నేరం హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌ ఠాణా పరిధిలో ఉన్న జెక్‌కాలనీలో ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. జెక్‌ కాలనీలోని ఆకృతి ఆక్రేడ్‌లో ఉన్న 502 ఫ్లాట్‌కు తాళం వేసి ఉండటంతో.. తాళాలు పగలగొట్టిన చుడీదార్‌ గ్యాంగ్‌ ఆ ఇంట్లో నుంచి నగదు, నగలు అపహరించుకుపోయింది. నగరంలో తిరిగి రోజు రోజుకూ దొంగతనాలు, స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో స్నాచింగ్‌, దొంగతనాలను పూర్తిస్థాయిలో కట్టడిచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేరాల కట్టడికి చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల దొంగతనాలు, స్నాచింగ్‌లు పెరగడమే ఇందుకు నిదర్శనం.

ఎస్‌ఆర్‌నగర్‌లోని అపార్టుమెంటులో చుడీదార్‌ ధరించి ఒకరు బుర్కా, మరొకరు ముఖానికి స్కార్ప్‌ కట్టుకొని చొరబడ్డారు. దొంగలు అపార్టుమెంటులో తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే, మగవాళ్లే ఆడవారి దుస్తులు వేసుకొని వచ్చి ఉంటారా..? ఆడవాళ్లే వచ్చారా..? అనే అంశంపై పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మగవాళ్లే ఆడవాళ్ల దుస్తుల్లో వచ్చి దొంగతనాలు చేసేందుకు ఎక్కువ అవకాశం ఉన్నదని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు చెబుతున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌లో చుడీదార్‌ గ్యాంగ్‌ చోరీకి పాల్పడిన ఘటనను ఇప్పుడు నగర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆడవాళ్ల వేషధారణతో దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మహిళల దుస్తులు ధరించడం వల్ల దొంగతనం చేయడం ఈజీ అవుతుందని, అపార్టుమెంటులోకి కూడా ఈజీగా ప్రవేశించేందుకు అవకాశం ఉంటుందని, ఎవరికీ అనుమానం రాకుండా కొత్త తరహాలో దొంగతనాలు చేస్తున్నారని, ఈ గ్యాంగును గుర్తించి పట్టుకునేందుకు నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నారు.