నామినేషన్లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలీసు శాఖను కోరారు.
నామినేషన్లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలీసు శాఖను కోరారు. ఈ మేరకు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై అక్రమ కేసులు పెట్టారని.. ఈ క్రమంలో 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
‘‘కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ దాఖలు చేసే సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీసు స్టేషన్లలో, వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారు. సంబంధిత ఏజెన్సీలు, అధికారులు నాపై పెట్టిన కేసుల విషయంలో సమాచారం ఇవ్వలేదు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న నాపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలి. ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని కోరుతున్నా. వ్యక్తిగతంగా నేను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం ఆచరణ సాధ్యం కాదు. అందుకే డీజీపీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వండి’’ అని లేఖలో కోరారు.
డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలు, ఏసీబీ, సీఐడీ విభాగాలకూ వేర్వేరుగా చంద్రబాబు లేఖలు పంపారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందనే అనుమానంతో ముందుగానే లేఖ రాసి వివరాలు కోరినట్లు తెలిపారు. సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా డీజీపీకి లేఖ రాసినట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.