ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది
ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో పటిష్ఠమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించడంతో చెన్నై ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో సిఎస్‌కె ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న చెన్నై ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ రురురాజ్ గైక్వాడ్, శివమ్ దూబెలు ఫామ్‌లో ఉండడం చెన్నైకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. రుతురాజ్ ప్రత్యర్థి మ్యాచ్‌లోనూ మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. రచిన్ రవీంద్ర కూడా మెరుపు ఆరంభాన్ని అందిస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో కూడా రచిన్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ రుతురాజ్ మరోసారి భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. శివమ్ దూబె కూడా జోరుమీదున్నాడు. ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. డారిల్ మిఛెల్, జడేజా, ధోనీ తదితరులతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. మరోవైపు తుషార్ దేశ్‌పాండే, ముస్తఫిజుర్, శార్దూల్, జడేజా, మతీషా పతిరణ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా మెరుగ్గానే కనిపిస్తోంది. దీంతో చెన్నైకి ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఆతిథ్య లక్నోను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. డికాక్, కెప్టెన్ రాహుల్, దీపక్ హుడా, స్టోయినిస్, పూరన్, కృనాల్ పాండ్య వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక మోసిన్ ఖాన్, రవి బిష్ణోయ్, జోసెఫ్, కృనాల్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో లక్నోకు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.