ముంబై పై చెన్నై ఘనవిజయం

ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది నాలుగో విజయం కావడం విశేషం. ఇక వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీద కనిపించిన ముంబైకి ఈసారి ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకం సాధించినా ఫలితం లేకుండా పోయింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఓపెనర్లు రోహిత్, ఇషాన్ కిషన్‌లు శుభారంభం అందించారు.

ధాటిగా ఆడిన ఇషాన్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 23 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయితే తిలక్‌వర్మ (31)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఒంటరి పోరాటం చేసిన రోహిత్ 63 బంతుల్లోనే 5 సిక్సర్లు, 11 ఫోర్లతో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇదే క్రమంలో టి20 కెరీర్‌లో 500 సిక్సర్లు కొట్టి నయా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైను రుతురాజ్ (69), శివమ్ దూబె 66 (నాటౌట్) ఆదుకున్నారు.