చైనీస్ హ్యాకర్స్ అడ్వాన్స్‌డ్ లీనక్స్ మాల్‌వేర్‌తో గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనీస్ హ్యాకర్స్ అడ్వాన్స్‌డ్ లీనక్స్ మాల్‌వేర్‌తో గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఎర్త్ లుసా’ అని పిలిచే ఒక చైనీస్ హ్యాకర్ ‘స్ప్రేసాక్స్” పేరిట మాల్‌వేర్ సృష్టించి పలు దేశాల్లోని ప్రభుత్వ ఏజెన్సీలను లక్ష్యంగా చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ కొత్త మాల్‌వేర్‌ను ‘ట్రెండ్‌మైక్రో’ సంస్థ విశ్లేషించడంతో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ట్రోచిలస్ ఓపెన్ సోర్స్ విండోస్, లీనక్స్ మాల్‌వేర్ నుంచి కొన్ని టూల్స్‌ను ఉపయోగించి సరికొత్త ‘స్ప్రేసాక్స్’ను సృష్టించినట్టు తేలింది. ఈ ఎర్త్‌లుసా ప్రధానంగా విదేశీ వ్యవహారాలు, టెక్నికల్, టెలికమ్యూనికేషన్, డిఫెన్స్ సంస్థలపై దాడులు చేస్తున్నట్టు గుర్తించారు.
ఎన్‌క్రిప్టెడ్ ఫైల్స్‌ను కూడా డీకోడ్ చేయగల సామర్థ్యం ఈ మాల్‌వేర్‌కు ఉన్నట్టు సైబర్ నిపుణులు గుర్తించారు. ప్రమాదకరమైన ఈ మాల్‌వేర్ డాటాను దొంగిలించడం, ఫార్వార్డ్ చేయడం, డౌన్‌లోడ్-అప్‌లోడ్‌లను పర్యవేక్షించడం, ఫైల్‌ను రీనేమ్ చేయడం, ఐపీ అడ్రస్‌లు, నెట్‌వర్క్ కనెక్షన్లు గుర్తించి వాటి సమాచారాన్ని చేరవేయడం, ఆఖరికి రిమోట్‌ను యాక్సెస్ చేసే సామర్థ్యం కూడా దీనికి ఉన్నట్టు గుర్తించారు. 2019 నుంచి 2022 వరకూ ఎర్త్ లుస్కా సైబర్ అటాక్‌లు చేసినట్టు నిపుణుల పరిశోధనలో తేలింది. ఈ స్ప్రేసాక్స్‌కు v1.1, v1.3.6 వంటి రెండు వెర్షన్లు కూడా ఉన్నట్లు ట్రెండ్‌మైక్రో సంస్థ తెలిపింది. కొత్తగా డౌన్‌లోడ్ చేసే ఫైల్స్, చూసే వీడియోలు, ఇచ్చే యాక్సెస్‌లు, థర్డ్‌పార్టీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎర్త్‌లుస్కా సైబర్ అటాక్‌లలో ప్రధానంగా రక్షణ రంగాలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నట్టు ట్రెండ్‌మైక్రో విశ్లేషించింది. వీటితోపాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక సంపత్తిపైనా కన్నేసినట్టుగా చెబుతున్నారు. భారత్‌లోనూ ఈ దాడులు కొనసాగే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. త్రివిధ దళాలకు చెందిన ఆయుధ సంపత్తిపై చైనా కన్నుపడితే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్న ఆయా విభాగాల ఉద్యోగులను, సైనికులను భారత రక్షణ రంగం అప్రమత్తం చేసినట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని త్రివిధ దళాలకు చెందిన బీడీఎల్, ఏవీఎల్‌ఎన్, డీఆర్‌డీవో వంటి పలు ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి సైతం కొత్త మాల్‌వేర్ పట్ల అవగాహన కల్పించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే యాంటీవైరస్, మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్లను అప్‌డేట్ చేసుకోవాలని, మెయిల్స్, పాస్‌వర్డ్స్ స్ట్రాంగ్‌గా మార్చుకోవాలని సూచించినట్టు సమాచారం.