తెలంగాణ విద్యార్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ విద్యార్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 24వ తేదీ నుంచి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 వేలకు పైగా బడుల్లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు అల్పాహారం ప్రారంభించనున్నారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయకుండా, మోడల్ స్కూళ్లు, మదర్సాలు, ఎయిడెడ్ పాఠశాల్లోనూ అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
విద్యార్థులకు ఇప్పటికే నాణ్యమైన విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మానవీయ కోణంలో పోషకాహారాన్ని అందించేందుకు ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఉదయాన్నే విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలన్న సంకల్పంతో అల్పాహార పథకాన్ని అమలు చేయబోతోంది. విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత పెంచటం, కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదన్న ద్విముఖ వ్యుహాంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెడుతుంది. సన్నబియ్యం, రాగిజావ, మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు/అరటి పండు వంటివి అందించబోతున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల సమయంలో స్నాక్స్‌ను అందజేస్తుండగా, తాజాగా సుపోషణలో భాగంగా బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయనుంది.
ఏ రోజు ఏమేం పెడతారంటే..?
సోమవారం - గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం - బియ్యం రవ్వ కిచిడి, చట్నీ
బుధవారం - బొంబాయ్ రవ్వ ఉప్మా, సాంబార్
గురువారం - రవ్వ పొంగల్, సాంబార్
శుక్రవారం - మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్
శనివారం - గోధుమ రవ్వ కిచిడి, సాంబార్
అయితో రోజుకు ఒక వెరైటీతో పిల్లల కడుపు నింపేందుకు సర్కారు ముందుకు వచ్చింది. మిల్లెట్లతో సాంబార్ లేదా చట్నీ కాంబినేషన్ లో నాణ్యమైన, ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని అందించబోతోంది.