మే రెండో వారంలో ఎంసెట్‌?

ఎంసెట్‌ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను గురు లేదా శుక్రవారాల్లో ప్రకటించనున్నారు

ఎంసెట్‌ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను గురు లేదా శుక్రవారాల్లో ప్రకటించనున్నారు. ఎంసెట్‌ పేరు మార్పుపై జీవో జారీ అయితే గురువారం సాయంత్రానికి వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన కాలపట్టికకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఆమోదం తెలిపినట్లు సమాచారం. మే రెండో వారంలో ఎంసెట్‌ ప్రారంభిస్తారని సమాచారం. పీఈసెట్‌, పీజీఈసెట్‌లు మాత్రం మే చివరి నుంచి జూన్‌ తొలి వారంలో జరగనున్నాయని తెలిసింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎంతోపాటు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఎంసెట్‌తోపాటు ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ల తేదీలను ప్రకటిస్తారు. ఈసెట్‌ను మాత్రం మే మొదటి వారంలో నిర్వహిస్తారు. మరోవైపు పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌లో ఈసారి పరీక్ష విధానాన్ని మార్చాలని నిపుణుల కమిటీ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సిఫారసు చేసింది.