లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించనున్నది.
లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించనున్నది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. తొలి జాబితాలో ఎంపిక చేసే అభ్యర్థుల్లో తెలంగాణ సహా ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, లక్షద్వీప్, కేరళ, మేఘాలయ, త్రిఫుర, సిక్కిం, మణిపూర్ రాష్ర్టాలు ఉన్నట్టు సమాచారం.
సమావేశంలో 10 రాష్ర్టాల్లోని 60 నియోజకవర్గాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది. మరో 40 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేశాక, 100 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నదని సమాచారం. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎన్నికల కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. రాష్ట్రంలోని 10 మంది అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టు తెలిసింది. రాత్రి సమావేశం నుంచి బయటకు వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగుతున్నదని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించే అధికారం తనకు లేదని తెలిపారు.