ఫీజుల నియంత్రణకు సర్కారు కసరత్తు

ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఏ పాఠశాలలో.. ఏ తరగతికి.. ఎంత మొత్తం ఫీజు వసూలు చేస్తున్నారనే సమాచారాన్ని ఇక నుంచి కచ్చితంగా తెలపాల్సిందేనని విద్యాశాఖ ఆదేశించింది.

ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఏ పాఠశాలలో.. ఏ తరగతికి.. ఎంత మొత్తం ఫీజు వసూలు చేస్తున్నారనే సమాచారాన్ని ఇక నుంచి కచ్చితంగా తెలపాల్సిందేనని విద్యాశాఖ ఆదేశించింది. ఈ వివరాలు సమగ్రంగా సేకరించడంతోపాటు వాటిని జిల్లాలు, పాఠశాలలు, తరగతుల వారీగా ఆన్‌లైన్‌లో పొందుపరచాలని నిర్ణయించింది. ఈ మేరకు డీఈఓలను ఆదేశించడంతో వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు.  ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ 2017 నుంచి పలు ప్రయత్నాలు చేసినా ఫలితాలు కనిపించలేదు. తాజాగా ఈ విషయంలో కొంత ముందడుగు పడింది.

గతేడాది ఏప్రిల్‌లో నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఏటా 10 శాతానికి మించి ఫీజులు పెంచరాదని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దానిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయడం లేదని హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) న్యాయస్థానంలో విద్యాశాఖపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దానిపై విచారణ ప్రక్రియ కొద్ది నెలలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఒకడుగు ముందుకేసి ప్రస్తుతమున్న ఫీజుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా చర్యలకు దిగింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల వివరాలను పాఠశాల విద్యాశాఖకు చెందిన ఐఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌లో పొందుపరచనుంది. ఇందు కోసం సాఫ్ట్‌వేర్‌లో ఓ ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించింది. అందులో డీఈఓలు వివరాలు నిక్షిప్తం చేస్తున్నారు.