ఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు జిల్లాలో భారీ వర్షం పడింది. ఈ వర్షం ధాటికి ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం యడవల్లి గ్రామానికి చెందిన పరస రామారావు (41) పిడుగుపాటుతో మృతి చెందారు. పశువులను మేపడం కోసం పొలంలో ఉండగా ఈ ఘటన జరిగింది. పశువులను మేపడం కోసం పొలంలో ఉండగా ఈ ఘటన జరిగింది.
పిడుగు పాటుకు పశువులు సైతం మృతిచెందినట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలోని ముసునూరు మండలంలో ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. వందల ఎకరాల్లో అరటిపంట నేలకూలింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుడివాడలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఊటుకూరులో పిడుగుపాటుకు తల్లి, కూతుళ్లు మృతి చెందారు. పొలం నుంచి ఇంటికి వస్తుండగా పిడుగు పడటంతో బొందల నాగేంద్రం (52), యండ్రపల్లి నాగరాణి (25) మృతి చెందారు.
కాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలాయి. పొలంలో ఉన్న ధాన్యం తడిసి ముద్దాయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో భారీ హోర్డింగులు వర్షం ధాటికి కిందపడ్డాయి. విజయవాడ, గుంటూరు నగరాల్లో వర్షంతో ట్రాఫిక్ ‘ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎపిలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఆయా పార్టీల నేతలు తడుస్తునే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భానుడి భగభగలతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. ఎపిలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే ఎపి వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం విదితమే.