కీసరగుట్ట శివ నామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా మొదలయ్యాయి
కీసరగుట్ట శివ నామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు భవానీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఇదిలా ఉంటే కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ వెల్లడించారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మహా శివరాత్రిని పురస్కరించుకుని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌లో ప్రత్యేక బస్సులను నడపనున్నది.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆరు రోజుల పాటు 300 ఆర్టీసీ జాతర స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. కీసరగుట్టలో కుషాయిగూడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఆర్టీసీ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు కీసరగుట్ట నుంచి నగరంలోని పలు ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సహితం సరిపడా ఆర్టీసీ బస్సులను నడుపుతామన్నారు. 8 నుంచి 10 వరకు సీబీఎస్, పటాన్ చెరువు నుంచి ఏడుపాయల, బీరంగుట్ట జాతరకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయని చెప్పారు.