వ్యాధులతో సతమతమవుతున్న రోగులకు శ్రావ్యమైన సంగీతం అందించడంతోపాటు ఆరోగ్య సమస్యలపై వైద్యుల సలహాలు, సూచనలు ఇవ్వడానికి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సన్నాహాలు చేస్తోంది.
వ్యాధులతో సతమతమవుతున్న రోగులకు శ్రావ్యమైన సంగీతం అందించడంతోపాటు ఆరోగ్య సమస్యలపై వైద్యుల సలహాలు, సూచనలు ఇవ్వడానికి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సన్నాహాలు చేస్తోంది. అందుకు ఇక్కడి ఎయిమ్స్‌లో రేడియో స్టేషన్ ఏర్పాటు కానుంది. 15 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే ఈ స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించింది. 89.6 ఎంహెచ్‌జడ్ కింద ఈ రేడియో స్టేషన్ పనిచేస్తుంది. దీని ద్వారా రోగుల కోసం శ్రావ్యమైన సంగీతం ప్రసారం చేస్తారు. వివిధ ఆరోగ్య సమస్యలపై డాక్టర్లతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఉచిత వైద్య శిబిరాలకు సంబంధించిన సమాచారం, ఎయిమ్స్‌లో అందుబాటులో ఉన్న వైద్యసేవలు తదితర వివరాలతో కూడిన కార్యక్రమాలూ ప్రసారమవుతాయి.
బీఈసీఐఎల్ అధికారుల సూచనల మేరకు రేడియో స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. మరో మూడు నెలల్లో స్టేషన్ ప్రారంభమవుతుంది. దేశంలో రేడియో స్టేషన్ ఉన్న మొదటి ఎయిమ్స్ బీబీనగర్ కానుండడం విశేషం.