హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు

హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలంటే అవినాష్‌ ను, జగన్‌  ను ఎన్నికల్లో ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు.

హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలంటే అవినాష్‌ ను, జగన్‌  ను ఎన్నికల్లో ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. కడప పార్లమెంట్‌ పరిధిలోని అమగంపల్లి నుంచి ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  వైఎస్‌ వివేకా కూతురు సునీతతో కలిసి షర్మిల మాట్లాడారు.

వైఎస్‌ వివేకానంద హత్యకేసులోని నిందితుడికి మరోసారి జగన్‌ టికెట్‌ ఇచ్చారని మండిపడ్డారు. హంతకులను కాపాడుకోవడానికి జగన్‌ తన పదవిని వాడుకుంటున్నారని విమర్శించారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదని తాను కడప నుంచి పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.

వైసీపీ అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చి గద్దెను ఎక్కిన జగన్‌ ఐదేండ్లలో ఎందుకు తీసుకురాలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదాను సాధించి ఉంటే వంద పరిశ్రమలు వచ్చేవని, దీని ద్వారా రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించేదని అన్నారు. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికేవని పేర్కొన్నారు.  రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. పోలవరాన్ని పూర్తి చేయలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రామోహ్మన్‌ దంపతులు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.