రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో బీహార్ యువకుడికి నోటీసులు

హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు

హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ గా మారిన ఈ వీడియోను తొలుత పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించారు. బీహార్ కు చెందిన పందొమ్మిదేళ్ల యువకుడికి నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రష్మిక డీప్ ఫేక్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో తొలుత షేర్ చేసిన సదరు యువకుడు.. ఆపై ఇతర ఫ్లాట్ ఫాంలపై షేర్ చేశాడని చెప్పారు.

బీహారీ యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. అయితే, రష్మిక వీడియోను తాను ఇన్ స్టా నుంచి డౌన్ లోడ్ చేసినట్లు ఆ యువకుడు చెప్పాడని వివరించారు. తాను మార్పింగ్ చేయలేదని, ఇన్ స్టాలో ఉన్న వీడియోను డౌన్ లోడ్ చేసుకుని షేర్ చేశానని చెప్పాడన్నారు. కాగా, ఈ కేసు దర్యాఫ్తులో వేగం పెంచామని చెప్పిన పోలీసులు.. ఇప్పటి వరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని క్లారిటీ ఇచ్చారు.