దేశవ్యాప్తంగా పలు ప్రతిష్ఠాత్మక జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల తేదీలను జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) మంగళవారం ప్రకటించింది
దేశవ్యాప్తంగా పలు ప్రతిష్ఠాత్మక జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల తేదీలను జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) మంగళవారం ప్రకటించింది. జేఈఈ మెయిన్ రెండు విడతలతోపాటు నీట్, సీయూఈటీ యూజీ, పీజీ, యూజీసీ నెట్ తేదీలను వెల్లడించింది. వీటిలో నీట్ తప్ప మిగిలిన పరీక్షలన్నీ ఆన్‌లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో జరుగుతాయి. జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ తొలి విడత వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహిస్తారు. రెండో విడతను ఏప్రిల్ 1-15 తేదీల మధ్య జరుపుతారు. ఆన్‌లైన్ పరీక్షల ఫలితాలను పరీక్షలు ముగిసిన మూడు వారాల్లోపు ప్రకటిస్తామని ఎన్‌టీఏ పేర్కొంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది మే 5న నిర్వహించే నీట్ యూజీ-2024 ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ‘జాతీయ పరీక్షల తేదీల వెల్లడితో కొంతవరకు స్పష్టత వచ్చింది. ఇక రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల తేదీలు వస్తే ఎంసెట్ తదితర పరీక్షల తేదీలను వెల్లడిస్తాం’ అని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు.