మొక్కై వంగనిది మానై వంగదంటారు. ఇది ఆరోగ్య పరిరక్షణకూ వర్తిస్తుంది! ఊబకాయంతో తలెత్తే అనర్థాలు సరిదిద్దుకోలేనంతగా మారకుండా చూసుకోవటానికి బాల్యమే చక్కటి అవకాశమని ఐరోపా అధ్యయనం పేర్కొంటోంది మరి.
మొక్కై వంగనిది మానై వంగదంటారు. ఇది ఆరోగ్య పరిరక్షణకూ వర్తిస్తుంది! ఊబకాయంతో తలెత్తే అనర్థాలు సరిదిద్దుకోలేనంతగా మారకుండా చూసుకోవటానికి బాల్యమే చక్కటి అవకాశమని ఐరోపా అధ్యయనం పేర్కొంటోంది మరి. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ఊబకాయం రోజురోజుకీ పెరిగిపోతోంది. మనదేశంలో సుమారు 1.44 కోట్ల మంది పిల్లలు ఊబకాయులని అంచనా. పిల్లల్లోనైతే 15% మంది ఊబకాయులే. ప్రైవేటు బడుల్లో చదివే ఉన్నతాదాయ వర్గాల్లోనైతే 35-40% మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయం గలవారే కావటం గమనార్హం. ఊబకాయంతో చిక్కేంటంటే- ఇది అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక గ్లూకోజుతోనూ ముడిపడి ఉండటం. ఇవన్నీ రక్తనాళాలు, గుండెను దెబ్బతీసేవే. ఇలాంటి అనర్థాలను పెద్దయ్యాక వ్యాయామం, ఆహార నియమాలతో అంతగా సరిదిద్దుకోలేం. అదే బాల్యంలోనే జాగ్రత్త పడితే పూర్తిగా వెనక్కి మళ్లించుకోవచ్చు. అందుకే పిల్లల్లో ఊబకాయం, అధిక బరువు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం మంచిదని పరిశోధకులు గట్టిగా చెబుతున్నారు.
మామూలు బరువుతో ఉన్న పిల్లలతో పోలిస్తే ఊబకాయ పిల్లలకు పెద్దయ్యాక ఊబకాయం వచ్చే అవకాశం 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. గుండెజబ్బు ముప్పూ అధికమే. శరీర ఎత్తు, బరువు నిష్పత్తి (బీఎంఐ) తక్కువగా ఉన్న పిల్లలతో పోలిస్తే ఎక్కువ బీఎంఐ గలవారు మధ్యవయసులో గుండెజబ్బు బారినపడే ప్రమాదం 40% ఎక్కువ. ఊబకాయానికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కూడా తోడైతే మధ్యవయసులో గుండెపోటు, పక్షవాతం ముప్పు 2 నుంచి 9 రెట్లు ఎక్కువ. బాల్యంలోని కొన్ని అలవాట్లు పెద్దయ్యాకా కొనసాగుతూ వస్తుంటాయి. ఇవీ ఆరోగ్యం మీద ప్రభావం చూపేవే. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లల వ్యాయామ, ఆహార అలవాట్ల మీద ఓ కన్నేసి ఉంచాలని పరిశోధకులు చెబుతున్నారు.
చిన్నప్పుడు అలవడిన ఆహార అలవాట్లు, కుటుంబంతో ముడిపడిన జీవనశైలి జీవితాంతం కొనసాగే అవకాశముండటమే దీనికి కారణం. బడికి వెళ్లే పిల్లలకు రోజుకు కనీసం 60 నిమిషాల సేపు మధ్యస్థ స్థాయి నుంచి తీవ్రమైన శారీరక శ్రమ అవసరం. వారానికి కనీసం మూడు సార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలూ చేయాలి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు చూసే సమయాన్ని తగ్గించెయ్యాలి. ఉదయం అల్పాహారం విధిగా తినేలా చూసుకోవాలి. రోజుకు మూడు సార్లు భోజనం, రెండు సార్లు చిరుతిళ్లు ఇవ్వాలి. పండ్ల రసాలు, ఫాస్ట్ ఫుడ్, కూల్‌డ్రింకుల వంటి కేలరీలు ఎక్కువగా ఉండే పదార్థాలు, పానీయాల జోలికి వెళ్లనీయొద్దు. పండ్లు, కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తినేలా చూసుకోవాలి. కొవ్వు, చక్కెర పదార్థాలు తగ్గించాలి. ఈ విషయంలో పెద్దవాళ్లే పిల్లలకు ఆదర్శంగా నిలవాలి.