కన్న పిల్లలను కడతేర్చిన తల్లిదండ్రులు

చిన్నారులకు పాలల్లో పురుగు మందు కలిపి హతమార్చిన విషాద ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. 

చిన్నారులకు పాలల్లో పురుగు మందు కలిపి హతమార్చిన విషాద ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు కథనం ప్రకారం.. సీతంపేట గ్రామ పంచాయతీ శివారు అంకన్నగూడేనికి చెందిన పెండగట్ల అనిల్‌కుమార్‌, దేవికి ఐదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి లోహిత(2), 11 నెలల జస్విత ఉన్నారు. అనిల్‌ ట్రాక్టర్‌ డ్రైవింగ్‌తోపాటు వ్యవసాయం చేస్తున్నాడు. కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వారం రోజులుగా వీరు అత్తగారిల్లు అయిన నామాలపాడులో ఉంటున్నారు. శనివారం సాయంత్రం అంకన్నగూడెం వచ్చారు.


రాత్రి భార్య భర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరు చిన్నారులకు పాలల్లో పురుగు మందు కలిపి తాగించారు. వెంటనే అనిల్‌కుమార్‌, దేవి అక్కడి నుంచి పారిపోయారు. పక్కనే ఉండే చిన్నారుల తాత పెండగట్ల వెంకన్న ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్టు గమనించి ఇరుగు పొరుగు వారికి తెలిపారు. మంచం పక్కన పాల డబ్బా, పురుగుమందు డబ్బా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ తిరుపతి, గార్ల-బయ్యారం సీఐ రవి, ఎస్సై జీనత్‌కుమార్‌ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. వెంకన్న ఫిర్యాదుతో ఎస్సై జీనత్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.