ఎక్కడో ఉంటారు. మీ ఖాతా ఉన్న బ్యాంకు తరఫున మాట్లాడుతున్నామని ఫోన్‌చేస్తారు.
ఎక్కడో ఉంటారు. మీ ఖాతా ఉన్న బ్యాంకు తరఫున మాట్లాడుతున్నామని ఫోన్‌చేస్తారు. మీ బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు తాలూకూ సమస్య పరిష్కారానికి వివరాలు చెప్పాలని అనుమానం రాకుండా అడుగుతారు. లేదంటే లింకులు పంపి వివరాలు నమోదు చేయాలని కోరుతారు. కోట్ల మందిపై ఇలా వలవేస్తారు. నిజమని నమ్మి వివరాలు ఇచ్చిన వారి ఖాతాల్లోని నగదును, క్రెడిట్ కార్డుల్లోని లిమిట్‌ను క్షణాల్లో ఖాళీ చేస్తారు. ఇదీ సైబర్ నేరగాళ్ల నైజం. ఇలా 32 నెలల వ్యవధిలో దేశంలో రూ.పది వేల కోట్లు దోచుకున్నారు. నానాటికీ పెరిగిపోతున్న ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు దేశవ్యాప్తంగా అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ‘ప్రతిబింబ్’ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను అన్ని రాష్ట్రాల పోలీసులకు అందిస్తున్నారు. సైబర్ నేరాల దర్యాప్తునకు ఇది చుక్కానిలా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో గత ఏడాది దొంగతనాలు, దోపిడీల్లో ప్రజలు పోగొట్టుకున్న సొత్తు రూ.150 కోట్లు కాగా.. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం రూ.707 కోట్లు. ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) లెక్కల ప్రకారం 2021 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబరు వరకూ దేశంలో సైబర్ నేరాల ద్వారా దోచుకున్న మొత్తం రూ.10,139 కోట్లు. అలానే గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ నేరాల సంఖ్య 15 లక్షలు. ఈ నేరాలు ఇంతలా పెరిగిపోవడానికి ప్రధాన కారణం.. నేరగాళ్లు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి సైతం కేవలం ఫోన్లు, ఈమెయిల్ ద్వారా వలవేసి దోచుకోవడమే. వీరు ఎవరనేది ఇప్పటివరకూ ఉన్న సాంకేతికతలతో.. పోలీసులు వెంటనే గుర్తించలేకపోతున్నారు. బాధితులు తమకు వచ్చిన ఫోన్ నంబర్, తమ బ్యాంకు ఖాతా వివరాలు మాత్రమే పోలీసులకు ఇవ్వగలరు. వీటితో అసలు నేరగాడు ఎక్కడున్నాడో గుర్తించి, అక్కడకు వెళ్లి పట్టుకోవడం సాధ్యంకావడంలేదు. అయినప్పటికీ కొన్ని కేసుల్లో అయినా నిందితులను అరెస్టు చేయగలుగుతున్నారు. దర్యాప్తులో ఎదురవుతున్న ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రతిబింబ్ సాఫ్ట్‌వేర్‌ను ‘ఐ4సీ’ అందుబాటులోకి తెచ్చింది. ఝార్ఖండ్ పోలీసుశాఖ రూపొందించిన ఈ సాప్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసింది. ప్రస్తుతం తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలిస్తున్నాయి.
ఎలా పనిచేస్తుందంటే...
తమ ఖాతా నుంచి డబ్బు కొల్లగొట్టారని బాధితుడు ఐ4సీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయగానే.. బాధితుడికి ఏ ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చిందో అధికారులు పరిశీలిస్తారు.
దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్ ప్రొవైడర్ల సహకారంతో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ఆధారంగా.. నేరగాడు ఏ టవర్ పరిధి నుంచి ఫోన్ చేశాడు తదితర వివరాలు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా దర్యాప్తు అధికారి కంప్యూటర్‌పై వెల్లడవుతాయి.
ఆ ఫోన్ నంబర్ ఉన్న ప్రాంత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి, తమకు వచ్చిన ఫిర్యాదును వారికి పంపుతారు. తద్వారా ఆ పోలీస్‌స్టేషన్ సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి, నగదు రికవరీకి అవకాశం ఉంటుంది.
అదే ఫోన్ నంబర్ ద్వారా నేరస్థుడు గతంలో ఏమైనా నేరాలు చేసి ఉంటే ఈ వివరాలనూ ప్రతిబింబ్ సేకరిస్తుంది. వీటి ఆధారంగా ఆ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయిస్తుంది.