ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో జనరేటివ్ ఏఐ టూల్స్ అత్యంత ఆదరణ పొందుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో జనరేటివ్ ఏఐ టూల్స్ అత్యంత ఆదరణ పొందుతున్నాయి. పలు రంగాలు, పరిశ్రమల్లో లేటెస్ట్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులకు నాందిపలుకుతోంది. జనరేటివ్ ఏఐ విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నా ఏఐ మోడల్స్‌ను రన్ చేయడం ఖరీదైన వ్యవహారంగా మారింది. ఏఐ మోడల్స్ నిర్వహణ బడా కంపెనీలే భరించగలిగేలా ఉండటంతో వీటి వాడకం ప్రస్తుతం పరిమితంగా ఉంది. ప్రస్తుతం ఏఐ మోడల్స్ రన్ చేయాలంటే రోజుకు మిలియన్ డాలర్లను కుమ్మరించాల్సిన పరిస్ధితి నెలకొనడంతో వీటిని నిలకడగా కొనసాగించడం భారీ వ్యయంతో కూడుకున్నది.
ఈ మోడల్స్‌ను నిర్వహించేందుకు కాంప్యుటేషనల్ పవర్ అవసరం కావడం వంటి ఎన్నో కారణాలతో ఏఐ మోడల్స్ రన్ చేయడం వ్యయభరితమవుతోంది. ఈ మోడల్స్ ఎనర్జీతో పాటు వనరులను విపరీతంగా సంగ్రహిస్తుండటంతో భారీ వ్యయం వెచ్చించాల్సి వస్తోంది. అయితే మున్ముందు వీటి నిర్వహణ వ్యయాలు దిగివస్తే జనరేటివ్ ఏఐ జనబాహుళ్యానికి విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ మోడల్స్ నిర్వహణ వ్యయాలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు.
ఎలాంటి వినూత్న ఆవిష్కరణ అయినా ఖరీదైన వెర్షన్‌తోనే ఆరంభమవుతుందని, రానున్న కాలంలో చిన్నపాటి జనరేటివ్ మోడల్స్ వస్తాయని, ఇవి అందుబాటు ధరలో లభించడంతో పాటు ఈ మోడల్స్ నిర్వహణ వ్యయం కూడా తగ్గుముఖం పడుతుందని ఆటోమేషన్ ఎనీవేర్ సహవ్యవస్ధాపకుడు, సీఈవో మిహిర్ శుక్లా పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ ప్రత్యర్ధులకు దీటుగా ఏఐ రంగంలో భారత్ ఎదుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐ రంగంలో భారత్ గణనీయ పురోగతి సాధించేందుకు సన్నద్ధమైందని 2025 నాటికి భారత్‌లో ఏఐ మార్కెట్ 780 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని విప్రో గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్ బ్రిజేష్ సింగ్ పేర్కొన్నారు.