సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది, ఇక తెలుగు సినిమాలు చేయదని అంతా అనుకున్నారు.
విరాట పర్వం రిజల్ట్, ఆ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె మాట్లాడిన మాటలు, వచ్చిన ట్రోలింగ్‌తో ఇకపై ఇటు కన్నెత్తి కూడా చూడదని అంతా ఫిక్స్ అయ్యారు. ఆ మధ్య గార్గి అంటూ డబ్బింగ్ సినిమాతో వచ్చింది. ఆ తరువాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు. చాలా గ్యాప్ తరువాత ఓ తమిళ సినిమాను ఒప్పుకుంది. శివ కార్తికేయన్‌తో కలిసి సాయి పల్లవి నటిస్తోంది. బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్ కొడుకుతో నటిస్తోందన్న రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా సాయి పల్లవి ఓ తెలుగు సినిమాను ఒప్పుకుందని అర్థం అవుతోంది. నాగ చైతన్యతో మళ్లీ నటించేందుకు సాయి పల్లవి రెడీ అయింది. సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి నటించిన లవ్ స్టోరీ చిత్రం ఎంతగా విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీతో ఆ జోడికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే క్రేజ్‌ను చందూ మొండేటి వాడుకుందామని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ బోర్డును నిన్న గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో చందూ మొండేటి వేయించి చూపించినట్టుగా ఉన్నాడు. ఇక ఈ చర్చలో హీరోయిన్ కూడా పాల్గొన్నట్టుగా హింట్ ఇచ్చారు. అంతే కాకుండా ఆమె ఈ ప్రయాణంలో జాయిన్ అయిందని కూడా చెప్పారు. కానీ ఆమె ఎవరు? అన్నది క్లారిటీగా చూపించలేదు. ఆ జుట్టు, చేతికి దండ చూస్తుంటే మాత్రం సాయి పల్లవి అన్నది క్లియర్‌గా తెలుస్తోంది. సాయి పల్లవే హీరోయిన్ అని క్లియర్‌గా ఎందుకు ప్రకటించ లేదు అన్నది మాత్రం తెలియడం లేదు.
ఏది ఏమైనా కూడా ఇన్నాళ్లకు మళ్లీ సాయి పల్లవి ఓ తెలుగు సినిమాను ఒప్పుకోవడంతే ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అది కూడా మళ్లీ నాగ చైతన్యతో జోడి కట్టడంతో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం శ్రీకాకుళం ఏరియా నుంచి పాకిస్థాన్‌లోకి వెళ్లిన జాలర్ల కథ అని, యదార్థ ఘటన ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.