మేడారం మహాజాతర శనివారం రాత్రి దేవతల వన ప్రవేశంతో ముగిసింది.
మేడారం మహాజాతర శనివారం రాత్రి దేవతల వన ప్రవేశంతో ముగిసింది. నాలుగు రోజులుగా భక్తులకు దర్శనాలు ఇచ్చిన దేవతలను ఆదివాసీ పూజారులు సంప్రదాయబద్దంగా వన ప్రవేశం చేయించారు. పూజారులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి సారలమ్మను కన్నెపల్లి ఆలయంలో, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయిలోని ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజుతో పూజారులు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు రాత్రి కాలినడకన బయలుదేరారు. 60 కిలోమీటర్ల దూరం కొనసాగే వీరి పాదయాత్ర ఆదివారం ఉదయం చేరుకుంటుంది. అత్యంత కీలకమైన సమ్మక్క వన ప్రవేశం ఘట్టం శనివారం రాత్రి జరిగింది. చిలకలగుట్ట వైపు బయలుదేరిన అమ్మకు మంత్రి సీతక్కతో పాటు దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్ ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పూజారులు కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురువనంలోకి తీసుకెళ్లి వనప్రవేశం ఘట్టాన్ని ముగించారు. దీంతో ప్రధాన జాతర పరిసమాప్తమైంది. ఈనెల 28న తిరుగు వారం పండగ నిర్వహించనున్నారు. జాతరకు వచ్చిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు.
ప్రభుత్వం మేడారం జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తగినన్ని నిధులు విడుదల చేయడంతో విజయవంతమైందని పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మొత్తం 1.50 కోట్ల మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. జాతర ముగిసిన సందర్భంగా శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా భావిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ 6వేల బస్సులను జాతర కోసం వినియోగించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు సీతక్క ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ శరత్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు అంకిత్, శ్రీజ, ఎస్పీ శబరీశ్ పాల్గొన్నారు.
ఈనాడు, హైదరాబాద్: ‘అమ్మవారి కుంకుమ భరిణె అంత పవిత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుంది’ అని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లకు పైగా వెచ్చించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకోవడం సంతోషకరం. దేవాదాయ శాఖ మంత్రిగా తొలిసారి మేడారం జాతర నిర్వహణ పనులను పర్యవేక్షించే బాధ్యత లభించింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖకు, అన్ని శాఖల ఉద్యోగులకు కృతజ్ఞతలు’ అని మంత్రి తెలిపారు.