కన్నుల పండుగగా శ్రీశైలం మల్లన్న కళ్యాణం

ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినాన మల్లన్నను వరునిగా చేసే పాగాలంకరణ ఘట్టం వీక్షంచేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు

ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినాన మల్లన్నను వరునిగా చేసే పాగాలంకరణ ఘట్టం వీక్షంచేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహా శివరాత్రి రోజు జరిగే ప్రధాన ఘట్టాలైన పాగాలంకరణ, లింగోద్బవకాల ప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించుటకు భక్తులు ఆలయ ప్రవేశం చేసేందుకు వివిధ ప్రయత్నాలు చేశారు. అదే విధంగా పాగాలంకరణ, కళ్యాణంలో పాల్గొనే వీఐపీ పాస్‌లతో పాటు సామాన్యభక్తులకు అవకాశం కలింగించామని చైర్మెన్‌ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి తెలిపారు.

శ్రీశైలేశుని వరునిగా చేసే అద్బుత ఘట్టమే పాగాలంకారము. ఈ పాగను ప్రకాశం జిల్లా హస్థినాపురంకు చెందిన పృధ్వి వెంకటేశ్వర్లు కొడుకు సుబ్బారావు శివరాత్రి కళ్యాణానికి స్వామివారి సువర్ణ గర్భాలయ కళశం పై నుండి నవనందులను కలుపుకుంటూ ప్రత్యేక ఆకృతిలో అలంకరించారు. పాగాలంకరణ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో దిగంబరుడైన పృధ్వి వేంకటేశ్వరులు చీకట్లో పాగాలంకరణ చేయడం స్వామివారి భక్తికి నిదర్శనం అని ఈవో పెద్దిరాజు అన్నారు. కఠోర నియమాలతో సంవత్సరాంతం రోజుకో మూరచోప్పున నేసి శివయ్యను పెళ్లి కొడుకును చేసేందుకు ఆభరణంగా ఉపయోగించడం సాంప్రదాయమని అర్చకులు చెప్పారు. ఈ సంవత్సరం శ్రీ మల్లికార్జున స్వామికి 31 తలపాగలు వచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా 4, బాపట్ల 7, శ్రీకాకుళం 6, విజయ నగరం 3, కోనసీమ 6,పశ్చిమగోదావరి 2, కృష్ణ 1, తిరుపతి 1, ఒడిశా 1 పాగలు సమర్పించారు.

మరోవైపు లింగోద్భవ సమయంలో గర్బాలయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైర్మెన్‌, ఈవో ఆధ్వర్యంలో 11 మంది వేదపండితులు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చనలు శాస్ర్తోక్తంగా జరిపించారు. అనంతరం సుమారు నాలుగు గంటల పాటు శ్రీశైల మల్లన్నకు వివిధ రకాల శుద్ధ జలాలు, పండ్లరసాలతో అభిషేకించారు. జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి శిష్య బృందంతో మల్లన్నకు ప్రత్యేక పూజలు చేసుకునేందుకు అర్చక వేదపండితులు వీలు కల్పించారు.

లింగోద్భవం అనంతరం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల లీలాకళ్యాణం అంగరంగ వైభవంగ నిర్వహించారు. కళ్యాణోత్సవంలో స్వామిఅమ్మవార్లు పట్టు వస్ర్తాలతో సర్వాలంకరణశోభితులై నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ మండపంలో వేదమంత్రోచారణల నడుమ నేత్రానందకరంగా కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించారు.

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ గంగాధర మండపం నుండి ప్రారంభమై నందిమండపం వరకు సాగిన ప్రభలో వేలాది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వివిధ రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ప్రభపై అర్చక వేదపండితులు కూర్చుని ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు స్వామిఅమ్మవార్ల ఆశిస్సులు అక్షింతలు అందజేశారు. ప్రభోత్సవం ముందు కోలాటాలు, చెక్కభజనలు, సాంప్రదాయ మేళాల చప్పుళ్లు, కళాకారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయని ఈవో పెద్దిరాజు అన్నారు.

ప్రభోత్సవం అనంతరం స్వామిఅమ్మవార్లు నందివాహనంసేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భ్రామరీ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లును వేంచుబజేసి షోడషోపచార పూజలు నిర్వహించినట్లు ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మెన్‌ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు. ఆలయోత్సవంలో భాగంగా స్వామిఅమ్మవార్లు నందివాహన పై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉత్సవం ఆద్యంతం కళారూపాలతో ఆకట్టుకునేలా సందడిగా సాగింది.