కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. డైనోసార్‌ల మాదిరిగా ఆ పార్టీ అంతరించిపోతుందని అన్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో పౌరి స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అనిల్ బలూనీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందని హెచ్చరించారు. ‘కాంగ్రెస్ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు. కొన్నేళ్లలో డైనోసార్‌లా కాంగ్రెస్ కూడా అంతరించిపోతుందేమోనని నేను భయపడుతున్నా’ అని అన్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీని బిగ్ బాస్ హౌస్‌గా రాజ్‌నాథ్ సింగ్ పోల్చారు. ‘వారు (కాంగ్రెస్ నేతలు) రోజూ ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. ఆ పార్టీ కాస్త బుల్లితెరపై బిగ్ బాస్ ఇల్లులా మారిపోయింది. రోజూ ఒకరి బట్టలు ఒకరు చించుకుంటున్నారు’ అని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని పిల్లలు కూడా గుర్తించలేరని ఎద్దేవా చేశారు.