వారికి ఓటు వేయడమంటే వారి మోసాలను బలపర్చడమే

కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే వారి మోసాలను బలపర్చడమే అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు

కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే వారి మోసాలను బలపర్చడమే అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ తండ్రి కనిలాల్‌నాయక్‌ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులను నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. హరీశ్‌రావు ప్రెస్‌మీట్‌ ప్రారంభిస్తుండగానే దేవరకొండలో కరెంటుపోయింది. దాంతో ‘ఇదీ రేవంత్‌ పాలన’ అంటూ ఆయన కాంగ్రెస్‌ సర్కారుకు చురకలంటించారు. ఉద్యోగ కల్పన విషయంలో వంట అంతా వండి పెట్టాక.. వడ్డించినట్టు కాంగ్రెస్‌ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. 

 

మహిళలకు స్కూటీలు, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ మాట తప్పిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు.. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మేధావులు, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ పాలన తీరుపై ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారకాంక్షతోనే కాంగ్రెస్‌ మోసపూరిత హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. బడి పంతుళ్లపై లాఠీచార్జీ చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని లేపాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్‌ రవీంద్రకుమార్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పల్లా ప్రవీణ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు టీవీఎన్‌ రెడ్డి పాల్గొన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చి వైద్యసేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపింది. లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి. ప్రజారోగ్యంపై కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నస్టిక్స్‌ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్‌ జీతాలు వెంటనే చెల్లించాలి. డయాగ్నస్టిక్‌ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం
– ఎక్స్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు