ఐపిఎల్‌లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది
ఐపిఎల్‌లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేక పోతున్నాయి. ఇప్పటి వరకు ఆరేసి మ్యాచ్ లు ఆడిన ఇరు జట్లు కేవలం రెండేసి విజయా లు మాత్రమే సాధించాయి. దీంతో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఇటు ముంబైకి, అటు పం జాబ్‌కు కీలకమే. ఇలాంటి స్థితిలో ముల్లన్‌పూర్ వేదికగా జరుగనున్న మ్యాచ్‌ను ఇరు జట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. రాజస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో పంజాబ్, చెన్నైతో చేతిలో ముంబై ఓటమి పాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్ రెండు జట్లకు సవాల్‌గా తయారైంది.
ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లు ఉన్నారు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, నబి వంటి ప్రపంచ శ్రేణి బ్యాటర్లు ముంబైకి అందుబాటులో ఉన్నారు. ఇషాన్, రోహిత్‌లు ఫామ్‌లో ఉండడం ముంబైకి అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఇద్దరు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. రోహిత్ ఇప్పటికే ఓ శతకం కూడా సాధించాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా తయారయ్యాడు. రోహిత్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. ఇషాన్ కూడా జోరుమీదున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లోనే 69 పరుగులు సాధించాడు.
అయితే సూర్యకుమార్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా ఒక్కదాంట్లో మాత్రమే రాణించాడు. బెంగళూరుపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్య మరో రెండు మ్యాచుల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. రానున్న మ్యాచుల్లోనైనా సూర్య నిలకడైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. ఇక షెఫర్డ్, తిలక్, టిమ్ డేవిడ్, నబిలతో ముంబై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక కొయెట్జి, బుమ్రా, శ్రేయస్, హార్దిక్ తదితరులతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉన్న సంగతి తెలిసిందే. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న ముంబై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
సవాల్ వంటిదే..
మరోవైపు ఆతిథ్య పంజాబ్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా సామ్ కరన్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. శిఖర్ ధావన్ గాయం బారిన పడడంతో జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. కాగా, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. అథర్వ, బెయిర్‌స్టో, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, లివింగ్ స్టోన్, అశుతోష్ శర్మ, కెప్టెన్ సామ్ కరన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే వీరి బ్యాటింగ్‌లో నిలకడగా లోపించింది. ఇది జట్టుకు సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే పంజాబ్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.