మహాశివరాత్రి పర్వదినాన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్త జన సంద్రంగా మారింది
మహాశివరాత్రి పర్వదినాన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్త జన సంద్రంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు శివనామ స్మరణతో మార్మోగాయి. అర్ధరాత్రి నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. సందర్శకులు అధిక సంఖ్యలో శివదర్శనం చేసుకున్నారు. సాయంత్రం ఆలయంలోని అద్దాల మండపంలో మహాలింగార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఇక్కడ మట్టితో రూపొందించిన 366 లింగాలను 15 ఆవరణాలుగా పేర్చి, ప్రాణప్రతిష్ఠ చేసి పూజించారు. ఈ సందర్భంగా రెండు గంటల పాటు అనువంశిక అర్చకుల మంత్రోచ్ఛారణలు మార్మోగాయి. అర్ధరాత్రి లింగోద్భవ సమయాన గర్భగుడిలో మూలవిరాట్టుకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. గుడి చెరువు పార్కింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శివార్చన, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జాగారం చేసే భక్తులను అలరించాయి.