రాష్ట్రంలో గ్రూప్-2 రాతపరీక్ష షెడ్యూలు ప్రకారం జరుగుతుందా?
రాష్ట్రంలో గ్రూప్-2 రాతపరీక్ష షెడ్యూలు ప్రకారం జరుగుతుందా? లేదా మరోసారి వాయిదా పడుతుందా? ఈ విషయమై నిరుద్యోగుల్లో సందిగ్ధం నెలకొంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన 5.51 లక్షల మంది కమిషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షను 2024-జనవరిలో నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాచరణ మొదలుపెట్టింది. గ్రూప్-2లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూలు జారీ చేసింది. వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది. అయితే నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది. ప్రస్తుతం కమిషన్ గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు పరిపాలన పరమైన ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రాలు గుర్తించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు ఇతర నియామక పరీక్షల తాజా పరిస్థితిపై ఇప్పటికే వివరాలు తీసుకున్న ప్రభుత్వం త్వరలో సమీక్ష నిర్వహించనుంది. ఈ సమీక్షలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.