పోలికలు.. పొలికేకలు!

ఆ ఇంట్లో ఓ పాపాయి పుట్టింది. ఆ కొత్త మనిషిని అందరూ సంతోషంగా స్వాగతించారు... ఒక్కరు తప్ప. అది తన అన్న.

ఆ ఇంట్లో ఓ పాపాయి పుట్టింది. ఆ కొత్త మనిషిని అందరూ సంతోషంగా స్వాగతించారు... ఒక్కరు తప్ప. అది తన అన్న. అందరూ ఆ పాపాయినే ముద్దు చేయడం, సమయం కేటాయించడం తనకు ఎందుకో నచ్చడం లేదు. ఈ తరహా సిబ్లింగ్‌ రైవల్రీ గురించి మనకు తెలియనిదేమీ కాదు. ఈర్ష్య, పోలికల్లాంటి కారణాలతో ఒకే కడుపున పుట్టినవారి మధ్య శత్రుత్వం ఏర్పడవచ్చు. చాలామంది తల్లిదండ్రులు ఈ కొట్లాటలను సహజంగా భావిస్తుంటారు. కానీ అవి పిల్లల మనసు మీద దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఈ సిబ్లింగ్‌ రైవల్రీని దూరం చేసేందుకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.


పోలికలు వద్దు. తమ్ముడు చూడు మార్కులు ఎక్కువ వచ్చాయి, అక్క చూడు బుద్ధిగా ఉంది.. లాంటి మాటలు తూటాల్లా పనిచేస్తాయి. ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదించని పరిస్థితికి చేరుస్తాయి.
ఇద్దరితోనూ సమానంగా సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. విడివిడిగా వారికోసం మీ కాలాన్ని వెచ్చిస్తున్న అభిప్రాయం కలిగించండి
వారు ఏం చెబుతున్నారో శ్రద్ధగా వినండి. ఆరోపణలు, అనుమానాలు కొట్టిపారేయవద్దు. మాటలు వినకుండా మధ్యలోనే అడ్డుకుని చిన్నబుచ్చవద్దు.
కుటుంబం అంతా కలిసి సమయాన్ని గడిపే అవకాశాలను వదులుకోవద్దు. కలిసి భోజనం చేయడం లాంటి పనులతో కుటుంబం మధ్య ఐక్యత పెరుగుతుంది.
ఎన్ని విభేదాలు ఉన్నా, ఎంత కాదనుకున్నా… రక్తసంబంధానికి ఉండే ప్రత్యేకత వేరు. దాన్ని పదిలంగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అందులో పెద్దల పాత్ర ఎంతైనా ఉంది!